కళాశాలల్లో సినిమా కార్యక్రమాలపై నిషేధం ..?

తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

hellotelugu-TelanganaGoovt

హైదరాబాద్: కళాశాలలు, విశ్వ విద్యాలయాల ప్రాంగణాల్లో వరుస వివాదాలు, భద్రతా సంబంధిత సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో సినిమా ప్రచారాలు, సినిమా ప్రదర్శనలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది . విద్యా సంస్థలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా భారీ కార్యక్రమాల సమయంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా ఈ ప్రతిపాదిత ఆంక్షల ఉద్దేశం. కళాశాలలు, విశ్వ విద్యాలయాల ప్రాంగణాల్లోని కార్యకలాపాలను నియంత్రించే ప్రస్తుత నిబంధనలను సమీక్షించి, ఏ కార్యక్రమాలను పరిమితం చేయాలి లేదా నిషేధించాలో గుర్తించాలని ఉన్నతాధికారులు విద్యా శాఖను కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల భాగస్వామ్యాన్ని, ప్రతిభను ప్రోత్సహించే విద్యా కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, చిన్న తరహా సాంస్కృతిక కార్యక్రమాలను విద్యాసంస్థలు కొనసాగించవచ్చు. అయితే కళాశాలలు, విశ్వ విద్యాలయాల ప్రాంగణాల్లో సినిమా ప్రచారాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను నిషేధించే అవకాశం ఉంది. దీంతో పాటు భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించే కళాశాలలు ముందుగానే స్థానిక విద్యా అధికారులకు లేదా పోలీసులకు తెలియ జేయాల్సి రావచ్చు. అంచనా వేసిన జన సమూహం పరిమాణం, వేదిక ఏర్పాటు, ప్రవేశ నిష్క్రమణ ఏర్పాట్లు, జనసమూహ నియంత్రణ చర్యలు , అగ్నిమాపక భద్రతా నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వారిని కోరవచ్చు.

హైదరాబాద్‌లోని విద్యా సంస్థలలో జరిగిన వరుస సంఘటనల నేపథ్యంలో ఈ ప్రతిపాదిత చర్య వచ్చింది. ఈ సంఘటనలు క్యాంపస్ భద్రతపై దృష్టిని కేంద్రీకరించాయి. అక్టోబర్ 17న నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దాండియా నైట్ వేడుకల సందర్భంగా సుమారు 80 అడుగుల తాత్కాలిక లైటింగ్ నిర్మాణం కూలి పోవడంతో 18 ఏళ్ల మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, కనీసం 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన పెద్ద ఎత్తున జరిగే కళాశాల కార్యక్రమాలలో భద్రతా చర్యలు , జనసమూహ నిర్వహణపై ఆందోళనలను వెలుగులోకి తెచ్చింది.

ఆగస్టు 22న జరిగిన మరో సంఘటనలో, మల్లారెడ్డి విశ్వ విద్యాలయంలో నటుడు యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా జనం ఒక్కసారిగా దూసుకు వచ్చారు. నటుడిని ఒక్కసారి చూడాలనే ప్రయత్నంలో విద్యార్థులు, అభిమానులు తొక్కిసలాట పడటంతో ఫ్లడ్‌లైట్ పోల్, స్పీకర్ బాక్సులు కూలిపోయి పలువురు గాయపడ్డారు..

Exit mobile version