Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని తీవ్రమైన నష్టాలతో ముగించింది. ముఖ్యంగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దిగుమతి సుంకాల నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మార్కెట్లు కూడా ఒత్తిడిలోకి చేరాయి.
శుక్రవారం ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 765.47 పాయింట్ల నష్టంతో 79,857.79 వద్ద నిలవగా, నిఫ్టీ (Nifty) సూచీ 232.85 పాయింట్లు పడిపోయి 24,363.39 వద్ద స్థిరపడింది. ఈ రిజల్ట్ ద్వారా సూచీలు గత మూడు నెలల కనిష్ఠ స్థాయిని నమోదు చేయడం గమనార్హం. మార్కెట్లో ఈ స్థాయిలో నష్టాలు నమోదవడం గత ఆరు వారాలుగా కొనసాగుతుండగా, కోవిడ్ కాలం తర్వాత ఇంత సుదీర్ఘకాలం మార్కెట్లు వరుసగా నష్టాలను చవిచూడడం ఇదే మొదటిసారి.
Stock Market – రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి విలువ ఆవిరి
బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులోనే సుమారు రూ.5 లక్షల కోట్ల మేర కోలిపోయింది. ప్రస్తుతం ఈ విలువ రూ.440.63 లక్షల కోట్లకు చేరినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) సైతం భారీగా అమ్మకాలకు దిగినట్టు సమాచారం.
ఈ ప్రభావంతో రియల్టీ, లోహ (మెటల్), టెలికం, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, కమోడిటీల రంగాల్లోని కంపెనీల షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీకి 24,200 – 24,150 పాయింట్ల మధ్య మద్దతు స్థాయి ఉన్నప్పటికీ, ఆ స్థాయిని అధిగమించి పడిపోతే 23,750 పాయింట్ల వరకు తగ్గే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు మరోసారి గరిష్టానికి
స్టాక్ మార్కెట్ (Stock Market) పతనం మధ్య బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగి రూ.1,03,420 వద్ద స్థిరపడింది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక రేటుగా భావిస్తున్నారు. వెండి ధరలు కూడా అదే ధోరణిలో కొనసాగుతూ, కిలో వెండి రూ.1,000 పెరిగి రూ.1,15,000 వద్ద ముగిసింది.
గత ఐదు రోజుల్లోనే బంగారం ధర రూ.5,800, వెండి ధర రూ.5,500 మేర పెరిగినట్టు ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గు చూపడంతో ఈ ధారణ కొనసాగే అవకాశముంది.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు


















