YS Sharmila : విద్యుత్ సర్దుబాటు పేరుతో ఏపీ సర్కార్ వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు పెంచబోమంటూ బుకాయిస్తూనే మరో వైపు సర్దుబాటు చేస్తున్నామంటూ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదని, సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలంటూ ఫైర్ అయ్యారు. రాబోయే కాలంలో ఇంకెన్ని ప్రజలపై భారం మోపుతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు . మంగళవారం వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు.
YS Sharmila Slams AP Govt
విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు అంటూ మండిపడ్డారు. పెంచేది లేదంటూనే జనాలకు బాబు ఝలక్ ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలు తప్పా మరోటి కాదన్నారు. జనం నెత్తిన మీరు పెడుతున్నది గుదిబండ కాక మరేమిటి అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారాన్ని మోపారని ఆరోపించారు. ఇది చాలదన్నట్లు మరో రూ.12 వేల కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గం అన్నారు షర్మిల. ట్రూ అప్ చార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయం సేకరిస్తుంటే మరో వైపు కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు.
కరెంటు ఛార్జీల వీర బాదుడులో జగన్ కి చంద్రబాబు వారసుడుగా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమిని గెలిపిస్తే ఒక్క రూపాయి పెంపు ఉండదన్నారని, అవసరమైతే ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. తీరా పవర్ దక్కాక 14 నెలల్లోనే రూ.30 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Karnataka Transport Sensational : రవాణా సమ్మెతో స్తంభించిన కర్ణాటక
















