TTD : తిరుమల – టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్ లైన్ (off line) లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ (TTD) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో ఆయన శ్రీవాణి దర్శనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత విధానం వల్ల సదరు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం పడుతోందన్నారు. వారి సౌకర్యార్థమై ఏ రోజు కా రోజు టికెట్ జారీ, దర్శనం కల్పించడం గురించి ప్రయోగాత్మకంగా ఆగస్టు 01వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు.
TTD Sensational Decision
తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తామని ప్రకటించారు ఏఈవో వెంకయ్య చౌదరి. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్టింగ్ సమయం కేటాయించామన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్లు కోటా ఉన్నంత వరకు జారీ చేస్తారని చెప్పారు.
యథావిధిగా తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31వ తేది వరకు ఆన్ లైన్ (online)లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. నవంబర్ 1వ తేది నుండి శ్రీవాణి టికెట్లను ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు ఏఈవో.
భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేసే ప్రదేశం వద్దకు చేరుకోవాలని కోరారు. ఈ నూతన విధానం తో భక్తులు వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
Also Read : TTD New Innovation : ఘాట్ రోడ్ వాహనాలపై పాలసీని రూపొందించాలి
















