హైదరాబాద్ : అండం దానం పేరుతో మహిళలను రిక్రూట్ చేసి.. ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన A-9 నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బేగంపేట సర్దార్ పటేల్ రోడ్డులోని సెంటర్ పాయింట్లో ఉన్న ఓయాసిస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ పరికరాలు, సంస్థాగత రికార్డులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మహిళల రిక్రూట్మెంట్, రిజిస్ట్రేషన్, స్క్రీనింగ్, అండం దానం కోసం రిఫరల్‌కు సంబంధించిన వివరాలను సేకరించారు. ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రలకు సంబంధించిన పత్రాలనూ పరిశీలనకు తీసుకున్నారు
స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, పత్రాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిస్తున్నారు. నెట్‌వర్క్‌లో ఎవరెవరి పాత్ర ఉంది? మహిళలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి రిఫర్ చేశారు? డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయి? అనే అంశాలను ఆధారాలతో నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యవర్తులు, ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలు, ఇతర వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. మహిళలకు ఇచ్చిన పరిహారం, మధ్యవర్తులకు చెల్లించిన మొత్తాలు, సంస్థల ప్రతినిధులు పొందిన ఆర్థిక ప్రయోజనాలు, కమీషన్ల వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. వ్యవస్థీకృతంగా మహిళలను రిక్రూట్ చేసి రిఫర్ చేసే ఆర్థిక వ్యవస్థ నడిచిందా? అన్న కోణంలో విచారణ సాగుతోంది.
డోనర్ రికార్డులు, రిఫరల్ వివరాలు, రిజిస్ట్రేషన్, స్క్రీనింగ్ విధానాలు, సమ్మతి పత్రాలు, వైద్య రికార్డులను పరిశీలిస్తున్నారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం–2021 నిబంధనలు పాటించారా లేదా అన్నది నిర్ధారిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను ఆర్థిక ప్రయోజనాల పేరుతో తీసుకొచ్చారా? మభ్యపెట్టి అండం దానం చేయించారా? నకిలీ పత్రాలు సృష్టించారా? ఏజెంట్లు, మధ్యవర్తులు, సంస్థల ప్రతినిధుల పాత్ర ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మల్కాజిగిరి పోలీసుల తెలిపారు.

















