హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా నిర్వహించారు. రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కేలు), అన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో (పీఓపీఎస్‌కేలు) ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రత్యేక మేళా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,300 మంది దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్, ఇతర సంబంధిత సేవలను పొందారు. సాధారణ పాస్‌పోర్ట్, తత్కాల్ పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సేవలకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్లు అందుబాటులో ఉంచారు. పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసే సమయాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక మేళా నిర్వహించారు.
వారాంతంలో అదనపు అపాయింట్మెంట్లు అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా దరఖాస్తుదారులకు త్వరితగతిన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, బయోమెట్రిక్ ప్రక్రియ, ఇతర సేవలను మరింత సులభతరం చేయడానికి ఈ కార్యక్రమం దోహద పడింది. తెలంగాణ ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, సౌకర్యవంతంగా పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు హైదరాబాద్ ఆర్పీవో కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక మేళాలతో పాటు సాధారణ అపాయింట్మెంట్ల ద్వారా కూడా ప్రజలు పాస్‌పోర్ట్, పీసీసీ సేవలను పొందవచ్చని సూచించారు. పాస్‌పోర్ట్ సేవల కోసం www.passportindia.gov.in వెబ్సైట్ లేదా ఎం-పాస్‌పోర్ట్ సేవా మొబైల్ యాప్‌ను వినియోగించు కోవాలని సూచించారు రీజినల్ పాస్ పోర్టు అధికారి.

















