హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీినవాస్ రెడ్డి నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై. సర్ కు మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించడంపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. ఓ వైపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మోదీ సర్కార్ ఏం ముఖం పెట్టుకుని ర్యాలీ నిర్వహించారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూపీలో అడ్రస్ లేకుండా పోయిందంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవన్నీ పగటి కలలేనంటూ కొట్టి పారేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సంఘాన్ని తొత్తుగా మార్చుకొని.. SIR పేరుతో పేరిట దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు దేశ వ్యాప్తంగా సీఈసీ నిర్వాకాన్ని ఎండగడుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకాలు ఎల్లకాలం చెల్లవన్నారు. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే, ఆపార్టీ నాయకులు నటిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోష్యం చెప్పారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దేశ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసి, అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం అని ప్రకటించారు.


















