ముంబై : ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో బీజేపీ మోదీ సర్కార్ నియంతృత్వ పాలన సాగిస్తోందని పేర్కొంది శివసేన యూబీటీ పత్రిక సంపాదకీయం పేర్కొంది. దేశ రాజధానిలో నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు జరిపిన చర్యలను ‘అధికార దర్పం’ అని పార్టీ అభివర్ణించింది. అసంతృప్తితో ఉన్న పౌరులతో చర్చలు జరిపే బదులు, అధికార యంత్రాంగం బలప్రయోగానికి పాల్పడుతోందని ఆరోపించింది. మోదీ ప్రభుత్వం పతన దశలోకి ప్రవేశించిందని పేర్కొంది. ఢిల్లీ వీధుల్లో పోలీసులు యువతపై లాఠీఛార్జ్ చేస్తుంటే ఆగ్రహంతో ఉన్న యువకులు ఏమాత్రం చలించకుండా దెబ్బలను భరిస్తూ అక్కడే నిలబడ్డారు. ‘మరింత కొట్టండి, కానీ నేను ఇక్కడి నుండి కదలను’ అని చెప్పే నిరసనకారులు ఉన్నప్పుడు, నియంతలు వారికి ఏమి చేయగలరు అని ప్రశ్నించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ ధోరణి ఢిల్లీ వీధుల్లో కనిపించింది. బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశంలో ప్రభుత్వం పాల్పడిన ఈ హింస మానవత్వానికే అవమానకరం.
మోదీ తనను తాను ‘విశ్వ గురువు’ అని పిలుచుకుంటారు. ఆయనను గుడ్డిగా అనుసరించే వారు ఆయనను విష్ణువు 13వ అవతారంగా భావిస్తారు. కానీ ఢిల్లీ వీధుల్లో వారు ఒక రాక్షస పాలనను సాగిస్తున్నారు; అమాయక యువకుల తలలను పగల గొడుతున్నారు. అధికారంలో ఉన్నవారు చర్చలకు సిద్ధం కాకపోతే వారి పాలన ఎక్కువ కాలం కొనసాగక పోవచ్చు అని ఆ సంపాదకీయం పేర్కొంది. సమ్మె జరుగుతున్నప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గడానికి నిరాకరించారని, ఇది పరిపాలన యంత్రాంగంపై పెరుగుతున్న ధిక్కారానికి సంకేతమని స్పష్టం చేసింది. ఉద్యమ నాయకులు, పాత్రికేయులు, ప్రభావిత పౌరులతో పరిపాలన యంత్రాంగం నిరంతరం ప్రత్యక్ష సంభాషణను నివారిస్తోందని పేర్కొంది. కొనసాగుతున్న యువత అసంతృప్తి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయమని ఎందుకు అడగలేదని, మంత్రుల రాజీనామాల గొలుసుకట్టు ప్రభావానికి ప్రభుత్వం భయపడుతోందని అది ప్రశ్నించింది.

















