అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అర్నబ్ తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, శానిటేషన్ సమస్యలు రాకుండా పూర్తి శ్రద్ధ పెట్టామని తెలిపారు. తుఫాన్ నష్టంపై కేంద్రానికి లేఖ రాయటంతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఫోన్లో మాట్లాడానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. అమిత్ షాకు తుఫాను తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావం అంశాలను వివరించడం జరిగిందన్నారు. ప్రాథమికంగా నష్ట తీవ్రత అంచనాను కేంద్రానికి పంపిస్తామన్నారు సీఎం. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సమగ్ర నివేదికను కూడా త్వరలోనే పంపేలా చర్యలు చేపడతాం అని వెల్లడించారు సీఎం.
ఇదిలా ఉండగా ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరితే 25 కేజీల బియ్యం ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు . చేనేత మగ్గాలు, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున ఉల్లిపాయలు, వంటనూనె, కందిపప్పు రేషన్ ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి సీఎస్ ను ఆదేశించామన్నారు సీఎం. షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకున్న వారికి రూ.1000 చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపారు . ఇల్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10 వేలు, దుకాణాలకు రూ.25 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. ఎంఎస్ఎంఈలకు కేటగిరీల వారీగా ఆర్ధిక సాయం చేస్తామని , ద్విచక్ర వాహనానికి రూ.3 వేల సాయం చెల్లించనున్నట్లు వెల్లడించారు. త్రిచక్ర వాహనాలకు 10 వేలు, పుష్ కార్ట్‌లకు 20 వేలు, వీవర్ కమ్యూనిటీకి రూ.25 వేలు, ఫిషింగ్ బోట్, వలలు ధ్వంసమైతే రూ.25 వేలు సాయం అందిస్తామన్నారు. హెక్టారుకు పత్తికి రూ.25 వేలు, చెరకుకు రూ.25 వేల చొప్పున, ఇతర పంటలకు ఆయా కేటగిరీల వారీగా పంపిణీ చేస్తామన్నారు.
ఇక అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. టమోటాకు రూ.25 వేలు చొప్పున సాయం చేస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల ఎన్యుమరేషన్ చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు . రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు. ఇవాల్టి నుంచే ప్రభావిత జిల్లాల్లో పంటలు మినహా మిగతా చోట్ల బాధితులకు ఆర్ధిక సాయం అందిస్తాం అన్నారు. బాధ్యతగా, ప్రజలకు వేగంగా సేవలు అందించి ఓ నమ్మకాన్ని, భరోసాను కల్పించటమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం.
















