హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత అల్లా రఖా రెహమాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన తాజాగా ప్రముఖ ఇతిహాస కథ రామాయణం ఆధారంగా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ రాబోతోంది. ఇందులో సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తోంది. తాజాగా రామాయణం సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ ఓ సాంగ్ ను విడుదల చేశారు. ఇది పూర్తిగా కవ్వాలిని పోలి ఉందంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ను ఏకి పారేస్తున్నారు. దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న పౌరాణిక ఇతిహాసం ‘రామాయణం’లోని ‘మంగళ రంగ్’ అనే కొత్త పాటపై ఏఆర్ రెహమాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. శ్రీరాముడు, సీతాదేవిల పవిత్ర వివాహ ఘట్టానికి నేపథ్య సంగీతంగా రూపొందిన ఈ పాటకు కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించగా, అరిజిత్ సింగ్ , శ్రేయా ఘోషాల్ గాత్రదానం చేశారు.
అయితే పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో శ్రోతల నుంచి అసహనం వ్యక్తమైంది. ఈ పాట సంగీత కూర్పులో కవ్వాలీ , సూఫీ శైలి ప్రభావం ఎక్కువగా ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ ఇతిహాసానికి ఇటువంటి సంగీత శైలి ఏమాత్రం సరిపోదని విమర్శకులు వాదిస్తున్నారు. కొందరు అభిమానులు ‘మంగళ రంగ్’ పాటను, రెహమాన్ గతంలో స్వరపరిచిన ‘రాక్‌స్టార్’ చిత్రంలోని ‘కున్ ఫయా కున్’ వంటి పాటలతో పోల్చారు. పవిత్రమైన వాతావరణాన్ని కాపాడేందుకు వీణ, సితార్, మృదంగం వంటి శాస్త్రీయ వాద్యాలను ఉపయోగించి, సంస్కృత పదాలతో కూడిన సాహిత్యాన్ని ఎంచుకోవాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక ప్రాజెక్టుకు రెహమాన్ సరైన ఎంపికేనా అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఆయన సృజనాత్మక దృక్పథాన్ని సమర్థిస్తున్నారు. కాగా ‘రామాయణం’ చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

















