అమరావతి : సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చదివి అర్థం చేసుకోవడం రాని గొడ్డలి పార్టీ నాయకుల నుంచి సరైన విశ్లేషణ ఆశించడం మాదే తప్పని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో తానే అత్యంత తెలివైన వాడినని తనకు తాను చెప్పుకునే ధర్మాన ప్రసాదరాదు సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా? అవి నీకు అర్థమయ్యాయా? అని ప్రశ్నించారు. తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులు అందితే సంబంధిత సాక్ష్యాధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. శాంతిభద్రతల సమస్య కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేక పోయారని నిర్ధారణ అయితే ఆ పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే నామినేషన్ల గడువును పొడిగించాలని, ఆ పొడిగింపు కూడా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి 48 గంటలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసిందన్నారు.
ఇంత స్పష్టంగా ఉన్న ఆదేశాలను వక్రీకరించి ప్రభుత్వానికి ‘చెంపదెబ్బ’ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టే వైసీపీ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులతో సమానంగా నామినేషన్లు దాఖలు చేయగలిగారని, తాము ప్రజాక్షేత్రంలో తేల్చుకునే వాళ్లమే తప్ప అక్రమంగా అడ్డుకునే వాళ్లం కాదని స్పష్టం చేశారు. 2021 స్థానిక ఎన్నికల ప్రక్రియలో మీ దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మరిచి పోలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అభ్యర్థులను, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసి, ఫిర్యాదు చేసినా, కోర్టును ఆశ్రయించినా చంపేస్తారనే భయం కల్పించి, 80 శాతం స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర మీది అని ఆరోపించారు. అదే మీ రప్పా రప్పా రాజ్యాంగం అంటూ ఎద్దేవా చేశారు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ని అక్రమంగా తొలగించిన తీరు, కోర్టు ద్వారా ఆయన తిరిగి నియమితులైన తర్వాత కూడా ఆయనపై చేసిన వ్యక్తిత్వ హననం ప్రజలు మరిచి పోలేదన్నారు.


















