విజయవాడ : సుప్రీం కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ అనిల్ చంద్ర పునేఠా . ఏడు జిల్లాలైన వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది అందించిన సమాచారం మేరకు ఈ సూచనలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాలని అన్నారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఉత్తర్వులు అందిన వెంటనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్ఈసీ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున, ఏడీజీపీ ఎస్. మధుసూధన రెడ్డి, ఐజీ బి. రాజకుమారి, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు .. సుప్రీంకోర్టు ఆదేశాలు అందిన తదుపరి మరియు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో 7 జిల్లాల్లోని 19 మున్సిపాలిటీస్ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీస్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.

















