న్యూఢిల్లీ : ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు ముందు శుక్రవారం సీజేపీ వ్యవస్థాపకు అభిజీత్ దిప్కే ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో పౌరులకు ,ప్రయాణికులకు అంతరాయం కలగవచ్చని పేర్కొంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నాయకుడు అభిజీత్ దిప్కేకు ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ చేశారు. కన్నాట్ ప్లేస్లో పార్టీ తలపెట్టిన లేహ్రా దో తిరంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరుతుండగా ఆయన నివాసం వద్ద అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రోజు ఢిల్లీ పోలీసులకు చెందిన 20 మందికి పైగా సిబ్బంది దిప్కే నివాసానికి చేరుకున్నారు. పౌరులు, వ్యాపారులు, ప్రయాణికులు, రోగులు ,ఇతరుల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశిస్తూ నోటీసు అందజేశారు.
ఈ నిరసన ప్రదర్శన నేపథ్యంలో రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసిన తరుణంలో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. మరో వైపు కేంద్ర సర్కార్ పై , పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే. ఇప్పటికే తాము డిమాండ్ చేసిన విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి తప్పు కోవాల్సిందేనని పేర్కొన్నారు. అంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కేసులు నమోదు చేయడం, అరెస్ట్ లతో భయపెట్టాలని అనుకోవడం తగదన్నారు. నిరసన తెలియ చేయడం, ఆందోళన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందన్నారు. కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని, కాషాయ సంస్థల గూండాలతో దాడులకు దిగుతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు దిప్కే.


















