తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని వరహా స్వామి విశ్రాంతి గృహం వద్ద ఏర్పాటు చేసిన ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణూ దీక్షిత్ చెప్పారు. రామ్ భగీచా-2లోనిమీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 1983లో ప్రారంభమైన ఆయుర్వేద కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఆయుర్వేద వైద్యశాలలో260 బెడ్లతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే విష చికిత్స, న్యూట్రిషన్ విభాగం, ప్రత్యక విభాగాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ప్రిన్సిపాల్ .
శ్రీవారి వైద్యసేవ ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రనుండి ఆయుర్వేద వైద్యులు విచ్చేసి రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం జరుగుతోందని చెప్పారు. ఔషధ మొక్కల ద్వారా జబ్బులు నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలోని కుటుంబాలకు ప్రత్యేక వైద్యం, అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో దాదాపు 80 రకాల ఔషధాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తయారు చేసే మందులు అత్యంత నాణ్యతతో తయారు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.



















