విజయవాడ : బెజవాడలో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళా -2026ను ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతకు ముందు ఇంద్రకీలాద్రిలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. లఖ్ పతి దీదీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెలుపల తొలి జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. వివిధ రాష్ట్రాల డ్వాక్రా మహిళల ప్రతినిధులతో గ్రూప్ ఫోటో దిగారు రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి తదితరులు. అనంతరం సరస్ మేళా ప్రాంగణంలో స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు ముర్ము.
జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.
స్వయం సహాయ సంఘాల మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ఏపీలో తీసుకుంటున్న చర్యలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించేందుకు ప్రధాని మోదీతో పాటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం తీసుకున్నారని అన్నారు. సాంకేతిక సాయంతో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మరింత బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. 11 లక్షల ఎస్ హెచ్ జీ గ్రూపులు ఏపీలో ఉన్నాయని, లక్ పతీ దిదీలను తీర్చిదిద్దటంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. షీ మార్టుల ద్వారా ఎస్ హెచ్ జీ మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద ఎత్తున చేపడతాం అన్నారు. మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ అంశంలో ఏపీ మోడల్ అమలు చేస్తాం అని ప్రకటించారు శివరాజ్ సింగ్ చౌహాన్.

















