తిరుమల : టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు పోటు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. సింహ వాహనసేవ అనంతరం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పదోన్నతి ఉత్తర్వులను వారికి అందజేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా పోటు వర్కర్ సీనియర్లుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి పదోన్నతులు కల్పించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాలక మండలిలో (Res. No. 576, Dt. 1612.2025)
తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఉద్యోగులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


















