అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం ఏరియా ఆసుపత్రి, చిత్తూరు జిల్లాలో పీలేరు ఏరియా ఆసుపత్రి, వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి, మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో గన్నవరం సామాజిక ఆసుపత్రి, గుడివాడ ఏరియా ఆసుపత్రి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బాపట్ల జిల్లాలో అద్దంకి, రేపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రాలు, తిరుపతి జిల్లాలో రైల్వేకోడూరు, సత్యవేడు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రకాశం జిల్లాలో కొండెపి, తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, పల్నాడు జిల్లాలో వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి, విజయనగరం జిల్లాలో బొబ్బిలి సామాజిక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నంద్యాల జిల్లాలో డోన్ ఏరియా ఆసుపత్రి, సున్నిపెంట సామాజిక ఆరోగ్య కేంద్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం, మడకశిర ఏరియా ఆసుపత్రిలలో కొత్తగా డయాలసిస్ సేవల్ని అందించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రతి కేంద్రంలో సుమారు రూ.85 లక్షల వ్యయంతో ఐదు డయాలసిస్ యంత్రాలు అందుబాటు లోకి వస్తాయి. వీటి ద్వారా రోజుకు 15 డయాలసిస్ సెషన్లు నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో దీర్ఘకాలంగా డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు సమీప ప్రాంతాల్లోనే చికిత్స పొందే సదుపాయం కలుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతోపాటు, రోగులు, వారి కుటుంబాలపై ప్రయాణ భారం, ఇతర ఖర్చులు తగ్గుతాయి. ఈ కేంద్రాల ద్వారా అందే సేవలకు ఏడాదికి రూ.11 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇప్పటికే పిఎంఎన్డిపి ద్వారా నడుస్తోన్న 61 కేంద్రాల్లో 754 మెషీన్లు పని చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా 2024-25లో ఈ రెండు కేటగిరీల్లో కలిపి డయాలసిస్ సేవలకు గాను ప్రభుత్వం రూ.126.58 కోట్లు వెచ్చించింది. 2025-26 నాటికి ఈ మొత్తం రూ.197.88 కోట్లకు చేరింది. 2026-27లో ఇప్పటి వరకు అయిన వ్యయం రూ.90.09 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ప్రభుత్వ రంగంలో 21, ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో కలిపి 149 డయాలసిస్ కేంద్రాలున్నాయి.

















