ఇంద్రకీలాద్రి (విజయవాడ) : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ ఉత్సవాల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బెజవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మ వారిని సీఎం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.
సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్నారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. భారీ భద్రత నడుమ క్యూలైన్లలో ఉన్న భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేశారు. అనంతరం అంతరాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా తమిళనాడు ముఖ్యమంత్రికి శ్రీ అమ్మ వారి శేష వస్త్రాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇరువురు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈఇద్దరి కలయిక ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

















