న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలో రోబోటిక్ సర్జరీలో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రోబోటిక్ వ్యవస్థల ఏర్పాటు, శస్త్రచికిత్సల సంఖ్యలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంతో భారత్ వేగంగా రోబోటిక్ సర్జరీకి ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు కేంద్రమంత్రి. అధునాతన శస్త్రచికిత్స సాంకేతికతకు భారత్ ఒక ముఖ్యమైన ప్రపంచ గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. ‘సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ’ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు , డిజిటల్ ఆరోగ్యం , వేగంగా విస్తరిస్తున్న సర్జికల్ రోబోటిక్స్ వ్యవస్థలో మనకున్న బలం కారణంగా ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల విషయంలో భారత్ ఒక కీలకమైన దశలో ఉందని ఆయన అన్నారు. ఈ భవిష్యత్ సాంకేతికతను ఆవిష్కరించడానికి, అభివృద్ధి చేయడానికి, దీనిలో నాయకత్వం వహించడానికి భారత్‌కు గొప్ప అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
రోబోటిక్ వ్యవస్థల ఏర్పాటు, శస్త్రచికిత్సల సంఖ్యలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ దేశంలోనే ముందంజలో ఉండడం శుభ పరిణామమని పేర్కొన్నారు జేపీ నడ్డా . భారత్ రోబోటిక్ సర్జరీకి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోబోటిక్-సహాయక శస్త్రచికిత్సల సంఖ్య 2021లో 2,257 నుండి 2025 నాటికి 10,937కు పెరగడం మామూలు విషయం కాదన్నారు. అలాగే ఇదే కాలంలో జాతీయ స్థాయిలో ఈ సంఖ్య 8,912 నుండి 44,857కు పెరగడాన్ని ఈ సదస్సు ఎత్తిచూపింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని సుమారు 39 ఆసుపత్రులలో రోబోటిక్ వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో 11 ఆసుపత్రులు ఒకటి కంటే ఎక్కువ రోబోటిక్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి; దీనివల్ల రోబోటిక్ వ్యవస్థల ఏర్పాటులో ఢిల్లీ-ఎన్‌సిఆర్ దేశంలోనే ప్రముఖ కేంద్రంగా నిలిచింది. ఈ వృద్ధి వివిధ ప్రధాన శస్త్రచికిత్స విభాగాలలో విస్తరించి ఉంది.


















