విజయవాడ : పరిశుభ్రత మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం సమక్షంలో నెట్ జీరో అంశంపై ఐఐటీ కాన్పూర్- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ స్వాతంత్రం కంటే స్వచ్ఛత ముందని పిలుపు ఇచ్చి ఆచరించి చూపించారని అన్నారు. అందుకే అక్టోబరు 2 తేదీన స్వచ్చాంధ్ర అవార్డులు 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. కోల్ కతాలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను చూసి ఆయనే స్వయంగా శుభ్రపరిచారని గుర్తు చేశారు. పరిశుభ్రత అనేది ఏ వర్గానికో సంబంధించింది కాదని, మన ఆరోగ్యం కోసం మనమే పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విశ్వసించిన వ్యక్తి గాంధీజీ అన ప్రశంసలు కురిపించారు నారా చంద్రబాబు నాయుడు.
జపాన్ లోనూ ప్రజలు ఎక్కడా రహదారులపై చెత్త వేయరు, కాగితాన్ని కూడా జేబులో వేసుకుని వెళ్లి చెత్తబుట్టలో వేస్తారని వెల్లడించారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పై కార్యక్రమం చేపట్టినప్పుడు నేను ఓ నివేదిక ఇచ్చానని తెలిపారు. అదే విధంగా ఏపీలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు సీఎం. గత పాలకులు ఎక్కడా పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టలేదని ఆరోపించారు. టన్నుల కొద్దీ చెత్త రోడ్లపై పేరుకు పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో నిర్వహిస్తున్నాం అన్నారు. ప్రతి నెలా 3వ శనివారం నేనే స్వయంగా స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతటా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో మన పట్టణాలు, గ్రామాలు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తు్న్నాయని అన్నారు. స్వచ్ఛతా ఉద్యమంలో అవార్డులు పొందిన వారికి అభినందనలు తెలిపారు. 22 విభాగాల్లో, 130 రాష్ట్రస్థాయి అవార్డులు , 2044 జిల్లా స్థాయి అవార్డులు ఇస్తున్నాం అన్నారు.


















