హైదరాబాద్ : భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త , మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రకటించి, గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసి, రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సముచితమైన సైన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక పార్కు, విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
దేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ప్రవేశ పెట్టిన విప్లవాత్మక చట్టాలైన విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ ఆహార భద్రత చట్టం, షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, అలాగే భూసేకరణ, పునరావాస చట్టం వంటి వాటిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన క్లిష్ట పరిస్థితుల్లో, డాక్టర్ మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేశారన్నారు. త్యాగనిరతి , అంకితభావంతో కూడిన ఆయన జీవితం ద్వారా నేటి తరాల వారిలో దేశభక్తి భావనను పెంపొందించాలనే లక్ష్యంతో తాము మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు సీఎం.
ఆర్థిక సలహాదారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆర్థిక మంత్రి , ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. అప్పటి ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు నాయకత్వంలో తన అనుభవాన్ని ఉపయోగించి సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టారన్నారు. తద్వారా, విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన దేశ దుస్థితిని మార్చి వేసిన ఘనత కూడా తనకే దక్కిందన్నారు. పీ.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సరళీకరణ, ప్రైవేటీకరణ , ప్రపంచీకరణ విధానాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయని కొనియాడారు.
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐఎస్బి (ISB) , అమెరికన్ కాన్సులేట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలకు నిలయమైన ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’లో డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం , పార్కును ఏర్పాటు చేయడం సముచితమని తాము భావించామన్నారు. ఈ సంస్థలు రాష్ట్ర ఆర్థిక బలానికి 40 శాతానికి పైగా తోడ్పాటును అందిస్తున్నాయని పేర్కొన్నారు.
















