అమరావతి : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్లు నీళ్లతో కళ కళ లాడుతున్నాయి. దీంతో మడ్డువలస ప్రాజెక్టులో నీటి నిల్వ 1.61 టీఎంసీల నుంచి 2.79 టీఎంసీలకు చేరిందని వివరించారు . తోటపల్లి బ్యారేజీకి కూడా భారీగా ప్రవాహం వచ్చిందని తెలిపారు. ఈ బ్యారేజీ వద్ద గతంలో 2,484 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు ఉండగా… ప్రస్తుతం 23,250 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉందని అధికారులు వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు పెరిగాయని తెలిపారు. 20న 11.67 టీఎంసీలుగా ఉన్న డొంకరాయి రిజర్వాయర్ నిల్వ 25వ తేదీ నాటికి 15.78 టీఎంసీలకు చేరిందని, సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్లో నిల్వ 1.52 నుంచి 3.90 టీఎంసీలకు పెరిగిందని వివరించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా ప్రవాహాలు నమోదైనట్లు తెలిపారు. ఇక్కడ సెప్టెంబర్ 20వ తేదీన 1.20 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే… ఈ నెల 25వ తేదీ నాటికి ఆ ప్రవాహాలు 3.50 లక్షల క్యూసెక్కులకు చేరిందని వెల్లడించారు.
20న ప్రకాశం బ్యారేజీకి 8,187 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 25న అది 40,521 క్యూసెక్కులకు పెరిగినట్లు తెలిపారు. మున్నేరుకు వచ్చే ప్రవాహం కూడా 3,210 నుంచి 9,000 క్యూసెక్కులకు పెరిగిందని వివరించారు. పెరిగిన ప్రవాహాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఓవైపు సహయక చర్యలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు రిజర్వాయర్లకు నీటని మళ్లించే అంశంపై దృష్టి సారించాలన్నారు. అలాగే చిన్న, మధ్య తరహా నీటి వనరులను కూడా నింపాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగం ఉండాలని.. అలాగే నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఈ టెలీకాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
















