అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలకు సంబంధించి కీలకంగా వ్యవహరించే పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. మరో వైపు గత వైసీపీ ప్రభుత్వ హయంలో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు పోస్టింగ్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (G.O.Rt.No.1829 ) జారీ చేసింది. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలన శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రస్తుతం ఎస్.పి.ఎఫ్ డీజీగా ఉన్న సి.ఎం. త్రివిక్రమ్ వర్మను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ / డైరెక్టర్ ఎఫ్.ఎస్.ఎల్ (FSL) గా బదిలీ చేశారు. ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న ఆర్. జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) గా నియమించారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి. రాజకుమారిని రైల్వేస్ ఐజీగా బదిలీ చేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కాంతి రాణా టాటా కు డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న విశాల్ గున్నీని డీఐజీ (ట్రైనింగ్)గా నియమించింది. అంతే కాకుండా అప్పా (APPA) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇక గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న బాబూజీ అట్టాడను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ, గ్రేహౌండ్స్ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించింది. పోలవరం ఓఎస్డీగా ఉన్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. సీఎమ్ఎస్జీ ఎస్పీగా ఉన్న జగదీష్ అడహళ్లిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించారు. సీఐడీ ఎస్పీగా ఉన్న కె. చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


















