అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక జన్యు పరీక్షల ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. తొలిదశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించి కణాల్లోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటి ఆధారంగా రోగికి ఏ చికిత్స అవసరమో వైద్యులు నిర్ణయించేందుకు వీలవుతుంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు ఈ విధానాన్ని ఉపయోగించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా సంస్థ, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాలను ఈ నెల 22న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సూక్ష్మస్థాయి జన్యు మార్పు పరీక్షల కోసం కొందరు రోగుల నమూనాలను బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు పంపించాల్సి వస్తోందని అన్నారు. ఈ ఇబ్బందిని తొలగించి రాష్ట్రంలోనే అధునాతన పరీక్షలు అందుబాటులోకి తీసుకు రావాలన్నదే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జన్యు పరీక్షలను రోగులకు ఉచితంగా అందించనున్నామని, బయట ప్రైవేటు కేంద్రాల్లో ఒక్కో పరీక్షకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు, పూర్తి స్థాయి పరీక్షలకు రూ.75 వేల వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ సదుపాయం ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. అవసరమైన పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, తొలిదశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.


















