అమరావతి : ఏపీ సీఎం కీలక సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని అత్యధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఎరువులు, పురుగు మందులు లేని సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ అధికారులను. వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలపై హై రిస్క్ ఉందని, ఈ ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ తాగునీటిని అందించాలి. పశువులకు నీటిని అందించడంతో పాటు.. పశుగ్రాసం అందేలా చూడాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా పంటలను సాగు చేయడం, పశుగ్రాసం పెంచడం.. మల్చింగ్ కోసం విత్తనాలు జల్లడం వంటివి చేయాలన్నారు. పచ్చదనం ఎంత మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వీబీ జీ రామ్ జీ పనులను అనుసంధానం చేసుకుంటూ జలధార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 50.7 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందన్నారు. ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 30.84 లక్షల హెక్టార్లల్లో సాగు చేయాల్సి ఉండగా… ఎల్ నినో కారణంగా 79 శాతం భూముల్లో సాగు పనులు మొదలు పెట్టారని వెల్లడించారు. పప్పు ధాన్యాల సాగు మెరుగ్గా ఉన్నా… నూనె గింజల సాగు తక్కువగా ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని పంటలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కన్పిస్తోందని తెలిపారు సీఎం. ఇప్పటికే సిద్దం చేసుకున్న కంటింజెన్సీ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. 5.21 లక్షల హెక్టార్లకు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులు సరఫరా చేశామన్నారు.

















