తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్వో కె.వి. మురళీకృష్ణ కలిసి తిరుమలలో క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ నిర్వహించారు. నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్–ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది మోహరింపు, విధి ప్రాంతాలు, భక్తుల రాకపోకల నిర్వహణ, రద్దీ నియంత్రణ, ఇన్–ఎగ్జిట్ మార్గాలు, అత్యవసర మార్గాలు తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన చోట చేపట్టాల్సిన అదనపు భద్రతా చర్యలపై అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గరుడసేవ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు. అక్కడ అవసరమైన మేరకు బందోబస్తు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. విధులకు కేటాయించిన ప్రతి అధికారి, సిబ్బంది తమ విధి ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఇన్–ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, నాలుగు మాడ వీధులు, ఆలయ పరిసరాల్లో భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, రద్దీ పెరిగే పరిస్థితులను ముందుగానే గుర్తించి వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని అననారు. భక్తులు ఒకేచోట గుమిగూడకుండా క్యూలైన్లను క్రమబద్ధంగా నిర్వహించాలని, అత్యవసర మార్గాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డు, ముఖ్యమైన జంక్షన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణను పటిష్టంగా చేపట్టాలని, భక్తుల వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా ముఖ్య ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచాలని, ఏదైనా అసాధారణ పరిస్థితి గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని అన్నారు. భక్తులతో మర్యాదగా, సంయమనంతో వ్యవహరిస్తూనే అవసరమైన చోట క్రమశిక్షణతో పరిస్థితిని నియంత్రించాలని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు.



















