అమరావతి : రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వేదిక కాకూడదని స్పస్టం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దురుద్దేశ పూర్వకంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
పోటీ పరీక్షలకు సిద్ధం చేయాల్సిన అభ్యర్ధులను రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే కొన్ని ప్రైవేటు కోచింగ్ సంస్థల యజమానులు దురుద్దేశంతో అభ్యర్ధులను నిరసనలకు, ఆందోళనల కోసం ప్రోత్సహించినట్టు తేలిందన్నారు. ఈ అంశాలపై దృష్టి సారించిన సీఎం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్ధులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు. వివిధ పోటీ పరీక్షలకు అభ్యర్ధులను సిద్ధం చేయాల్సిన ఈ కోచింగ్ కేంద్రాలు కొందరు అభ్యర్ధులను రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నడచు కోవాలని స్పష్టం చేశారు.
















