న్యూయార్క్ : వేగంగా విస్తరిస్తున్న ఏఐ వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించారు ఆంథ్రోపిక్ సీఈఓ అమోడేఐ . సైబర్ దాడుల వంటి దురుద్దేశ పూర్వక కార్యకలాపాల కోసం తమ ఏఐ మోడళ్లను దుర్వినియోగం చేసే ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ప్రకటించారు. భద్రతా చర్యలు అందుబాటులోకి రావడానికి తగిన సమయం దొరికేలా, వేగంగా సాగుతున్న కృత్రిమ మేధ పరిశ్రమ తన అభివృద్ధి వేగాన్ని తగ్గించుకోవాలని సీఈవో అన్నారు. అలా చేయకపోతే రాబోయే 6 నుండి 12 నెలల్లోనే ఏఐ వ్యవస్థలు మొత్తం ఇంటర్నెట్ను తమ ఆధీనంలోకి తీసుకోగల సామర్థ్యాన్ని పొందవచ్చని, అలాగే ఇతర ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని హెచ్చరించారు. ఏఐ రంగంలో ప్రముఖుడైన అమోడేఐ పరిశ్రమపై పర్యవేక్షణను పెంచడానికి ఒక ప్రణాళికను తన వెబ్సైట్లో ప్రతిపాదించారు.
అందులో ఒక భాగాన్ని ఆంథ్రోపిక్ ఇప్పటికే అమలు చేస్తోందన్నారు. మిగిలిన చర్యల కోసం విస్తృత పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అని నొక్కి చెప్పారు. ఏఐ మోడళ్లు అత్యంత కీలకమైన సామర్థ్య స్థాయిలకు చేరుకునే ముందు, అభివృద్ధిని నెమ్మదించడం వల్ల మనకు అదనంగా ఒకటి లేదా రెండు సంవత్సరాల సమయం దొరికితే, ఆ సమయాన్ని వ్యవస్థల పనితీరును మానవ విలువలకు అనుగుణంగా మలచుకునే ప్రక్రియను మెరుగు పరచడానికి వినియోగించు కోవచ్చు అని తెలిపారు. తద్వారా ఏదైనా తీవ్రమైన పొరపాటు జరిగే ప్రమాదాన్ని మనం గణనీయంగా తగ్గించవచ్చ ని పేర్కొన్నారు. పరిశ్రమలోని ఇతర ప్రముఖుల నుండి ఆయనకు తక్షణమే మద్దతు లభించింది. చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ, భద్రతకు సంబంధించి అమోడీఐ చేసిన ప్రతిపాదనలలో ఒకదానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
















