అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరాక ఇప్పటి వరకు రూ. .1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం అన్నారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తిచేశాం. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్ట్ చేశాం. ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్‌మాన్ అంటూ కథనం రాసింది. సంతోషం కలిగింది. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో నా పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు కూడా నేను ఇంత ఆనందించలేదు. రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఒత్తిడి ఉంది..
దానిని సరిచేస్తూ నీటిని ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరు అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్. ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్ గా పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. 36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చాం. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం అధికారుల తోడ్పాటుతో ఈ విజయాలను సాధించగలిగాం అన్నారు. ఇప్పటి దాకా సాధించిన ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదు.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరి వల్ల సాధ్యమైందని, ఈ విజయం టీమ్ సక్సెస్ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
















