తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యా రంగానికి సంబంధించి సర్కార్ వెల్లడించిన గణాంకాలు, వివరాలు పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోందంటూ ఎద్దేవా చేశారు. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు . కానీ 2026 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదని మండిపడ్డారు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తి కాలేదని, మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన సర్వే ఆధారంగా పీఎల్ఎఫ్ఎస్ ( పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ) 2023-24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 7 సంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉందన్నారు. 2018-19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023-24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన పీఎల్ఎఫ్ఎస్ క్యాలెండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 7 సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.
అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు జగన్ రెడ్డి. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడీయుఎస్ఐ గణాంకాలే వెల్లడిస్తున్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైందని ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిదని హితవు పలికారు.


















