అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి సంధ్యారాణి. తన స్వార్థ రాజకీయాల కోసం గిరిజన భవిష్యత్తుతో చెలగాటం ఆడితే చూస్తూ సహించే ప్రసక్తి ఉండదని హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీకి చెందిన మహిళా నాయకులను ఏ విధంగా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి? అని మండిపడ్డారు. రాజధాని మహిళలను బూటు కాళ్లతో తన్ని, వాళ్ల బట్టలు చించి వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టారో గుర్తులేదా? సొంత తల్లి, చెల్లిని ఏవిధంగా ఇంట్లో నుండి బయటకు గెంటేశారో గుర్తులేదా? పినతల్లి, సునీతకు ఏవిధంగా ద్రోహం చేశారో గుర్తు లేదా? పదవి కోసం తల్లిని పార్టీనుండి మెడబట్టి బయటకు గెంటేయ లేదా? మీ సొంతచెల్లి షర్మిల మీద మీ పార్టీ నేతలతో అసభ్యకరమైన పోస్టులు, ట్వీట్ లు పెట్టించలేదా? తల్లికి, చెల్లికి గౌరవం ఇవ్వని వాడు ప్రపచంలో ఎవరినీ గౌరవించడని అన్నారు. సొంతపిన్ని బొట్టు చెరిగి పోయి ఏడుస్తుంటే నువ్వు ఏవిధంగా ప్రవర్తించావో దేశం మొత్తం తెలుసని పేర్కొన్నారు.
న్యాయం కోసం పోరాడుతున్న సునీత గురించి నువ్వు ఏవిధంగా ఎద్దేవా చేస్తూ హంతకులకు అండగా నిలిచావో దేశమంతా తెలుసు. ఇలాంటి మీకు రాష్ట్ర ప్రజలంతా ఓటుతో తీర్పు చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి దిగజారి పోయావని పేర్కొన్నారు. గతంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన పాముల పుష్పశ్రీవాణి ఏనాడూ గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు సంధ్యారాణి. దళిత, గిరిజన సామాజికవర్గానికి చెందిన నాపై, హోంమంత్రి అనితపై కూడా అట్రాసిటీ కేసులు వర్తించక పోయినా తప్పుడు కేసులు పెట్టారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గిరిజనులను ఏవిధంగా ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. అందుకే 7 సీట్లలో మీకు 5 సీట్లు 2024లో ఇవ్వలేదు. కానీ ఈరోజు మీరు గిరిజనుల గురించి ముసలి కన్నీరు కారుస్తూ ట్వీట్లు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. వైసీపీ ఐదేళ్లపాలనలో ఐటీడీఏలను నిర్ధాక్షిణ్యంగా మూసేస్తే కనీసం వైసీపీకి చెందిన ఒక్క గిరిజన నాయకుడు, నాయకురాలు నోరు మెదప లేదన్నారు.
















