అమరావతి : రాజకీయాల్లో మార్పు కోసం జనసేన పార్టీ నిరంతరం ప్రయత్నం చేస్తుందని చెప్పారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్బంగా ఇవాళ జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం, వచ్చే తరం ఆలోచనలను సమాజానికి అందించడం కోసం యువజన విభాగం నిబద్దత తో పని చేస్తుందని అన్నారు. దేశమే ఫస్ట్ అనే నినాదంతో రాజకీయాల్లో బాధ్యతా యుతమైన యువతను దేశానికి అందజేస్తుందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. పిఠాపురంలో జనసేన పార్టీ యువజన విభాగం అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సంబంధించి పార్టీ రూపొందించిన ఏవీతోపాటు ఒక ప్రత్యేక గీతం, ప్రత్యేకమైన లోగోను ఆవిష్కరించామన్నారు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువజన విభాగం ఆవిష్కరణ ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారని చెప్పారు నాదెండ్ల మనోహర్. అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీసుల అనుమతితో బైక్ ర్యాలీలు చేశారన్నారు. కేరళం లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకుంటున్న ప్రాంతంలో సాంకేతిక సమస్యలు కారణంగా సందేశం ఇవ్వలేక పోయారని తెలిపారు మనోహర్. పిఠాపురంలో జరిగే యువజన విభాగం ఆవిష్కరణను 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించామన్నారు. యువజన విభాగం ఒక గొప్ప లక్ష్యంతో పని చేస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో యువత ముందు ఉంటారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.


















