అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గిరిజన ప్రాంతాలను ప్రశంసలతో ముంచెత్తారు. పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా గిరిజన ప్రాంతాల ప్రజలు ముందున్నారని పేర్కొన్నారు. పిల్లలే మన సంపద అనే సిద్దాంతాన్ని ఆచరిస్తున్నారు. ఇది గర్వకారణం అని అన్నారు సీఎం.2014లో విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్ ఇప్పుడు ప్రపంచ స్థాయి వైద్య పరికరాలను తయారు చేస్తోందని చెప్పారు. కరోనా సమయంలో పెద్దఎత్తున వైద్య పరికరాలు అందించిందన్నారు. మెడ్ టెక్ జోన్ ఉత్పత్తులు…అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ద్వారా ప్రపంచానికి ఎగుమతి అవుతాయని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరకే మందులు ఇచ్చే జన ఔషధి కేంద్రాలు ప్రారంభిస్తాం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. 104 సర్వీసుల ద్వారా మీ ఇంటి దగ్గరే 42 రకాల వైద్య పరీక్షలు చేసి మీకు అవసరమైన మందులు ఇస్తారని తెలిపారు.
సెప్టెంబరు 2 తేదీన అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీరు తీసుకు వస్తున్నాం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు సీఎం. తొలి సంతకంతో 16 వేల ఉద్యోగాలు ఇస్తే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. జే బ్రాండ్ల ద్వారా, కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. జే బ్రాండ్లను రద్దు చేసి మద్యం విధానాన్ని ప్రక్షాళన చేశామన్నారు. గతంలో గంజాయి ద్వారా ఏజెన్సీ ప్రాంతానికి చెడ్డ పేరు తెచ్చారన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దానిని మార్చేలా కాఫీ, మిరియాలు లాంటి పంటల ప్రత్యామ్నాయ పంటల ద్వారా గిరిజనులకు ఆదాయ మార్గాలు చూపాం అని చెప్పారు.
గ్రూప్-1 పరీక్షల్లోనూ గత పాలకులు అవకతవకలు చేశారన్నారు సీఎం. ఆర్డీఓ స్థాయి అధికారులను ఎంపిక చేసే పరీక్షా పత్రాలను ఓ ఎలక్ట్రీషియన్, ఓ అటెండర్ చేత దిద్దించారన్నారు. గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్ధుల జీవితాలతో ఆడుకున్నారని పేర్కొన్నారు .గత పాలనలో దేవాలయాల ప్రతిష్టను కూడా దెబ్బతీశారు. బలవంతపు మత మార్పిడులు చేశారని మండిపడ్డారు. ఓ మాజీ మంత్రి కోడలు కూడా బయటకు వచ్చి ఇంట్లో జరిగిన ఘటనల్ని బయట పెట్టిందన్నారు. అయినా జగన్ కు, ఆయన టీంకు బుద్ది రావడం లేదన్నారు.















