హైదరాబాద్ : తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జపాన్‌లోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నామని విద్యుత్, గనుల శాఖ మంత్రి గద్దం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హెచ్‌ఐటీ), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ)ల మధ్య భాగస్వామ్యానికి ప్రాథమిక ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించింది. ఈ సందర్భంగా, తెలంగాణలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సిద్ధం చేయడం వంటి అంశాలపై వారు ఆ సంస్థ నాయకత్వంతో విస్తృతంగా చర్చలు జరిపారు.
ప్రారంభ దశలో ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో భాగస్వామ్యాన్ని ప్రారంభించాలని, అలాగే తెలంగాణకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సహకార రంగాలను సంయుక్తంగా గుర్తించాలని నిర్ణయించాయి. హెచ్‌ఐటి–యిసు భాగస్వామ్యంలో ఒక కీలక భాగంగా విద్యార్థి మార్పిడి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని ఇరుపక్షాలు తీర్మానించాయి. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు జపాన్ సాంకేతిక విద్యా విధానం, ప్రయోగశాల ఆధారిత శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యా వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తారు. సాంకేతిక నైపుణ్యాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశాలను కూడా అందిస్తారు.
అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, శిక్షకులకు శిక్షణ (టీఓటీ), స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు, పరిశోధన, ప్రత్యక్ష పారిశ్రామిక అనుభవం వంటి రంగాలలో సహకారాన్ని అన్వేషించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. తెలంగాణలోని స్థానిక అవసరాలు, భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముఖ్యంగా అధునాతన తయారీ, మొబిలిటీ, ఆటోమొబైల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీలు, పర్యావరణ టెక్నాలజీ వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించు కోవడంపై చర్చలు జరిగాయి. ఇంజనీరింగ్ రంగంలో హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఉన్న సామర్థ్యాలు, తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం కేవలం సాంప్రదాయ విద్యా మార్పిడికి మాత్రమే పరిమితం కాదని, నైపుణ్యాలు, ఉపాధి కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పరిశ్రమల అవసరాలకు నేరుగా దోహదపడే కార్యక్రమాలను రూపొందించడమని వివేక్ స్పష్టం చేశారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా సాంకేతికత, ఉత్పాదక రంగం, పరిశ్రమల ఆధారిత విద్యా విధానంలో జపాన్ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అమలు చేయడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. తరగతి గది , ప్రయోగశాల విద్యను వాస్తవ పారిశ్రామిక సవాళ్లు మరియు పరిశోధనలతో అనుసంధానించే హెచ్‌ఐటి విధానంపై తెలంగాణ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది. తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఇటువంటి విధానాలను ఎలా అమలు చేయవచ్చనే దానిపై చర్చలు జరిగాయి.
హెచ్‌ఐటి ప్రతినిధులను హైదరాబాద్ సందర్శించాలని ఇదే క్రమంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని పర్యటించాల్సిందిగా మంత్రి ఆహ్వానించారు. తదుపరి చర్చల ద్వారా ఈ భాగస్వామ్యం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. డిసెంబర్‌లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’లో పాల్గొనాలని కోరారు. తెలంగాణతో మరిన్ని సంస్థాగత , పారిశ్రామిక భాగస్వామ్యాలను అన్వేషించాల్సిందిగా మంత్రి హెచ్‌ఐటి ప్రతినిధులను ఆహ్వానించారు. జపాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలతో ప్రత్యక్ష సంస్థాగత సంబంధాలను నెలకొల్పడంలో ఈ భాగస్వామ్యం మరో కీలక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య, నైపుణ్యాలు, పారిశ్రామిక అనుభవాన్ని అందించేందుకు ఇలాంటి భాగస్వామ్యాలను మరింత విస్తరిస్తామని తెలిపారు.















