తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజులు పాటు జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల నియామక పరీక్షలు ప్రశాంతం ముగిశాయని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 34 పరీక్షా కేంద్రాల్లో ఐదు రోజులపాటు ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. సంస్థ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నియామకంలో భాగంగా సివిల్ విభాగానికి 5,757 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,571(79.39%) అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు సీఎండీ. మెకానికల్ విభాగానికి 2,427 మంది దరఖాస్తు చేసుకోగా 648 (73.30%) మంది, ఎలక్ట్రానిక్స్/టెలికాం విభాగానికి 9,884 మంది దరఖాస్తు చేసుకోగా 8007 (81%) మంది హాజరైనట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఏఈఈ నియామక పరీక్షలలో అత్యధికంగా ఎలక్ట్రికల్ విభాగానికి 18,602 మంది దరఖాస్తు చేసుకోగా 16,718 మంది (90%) ఈ పరీక్షలు రాశారని సీఎండీ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఏఈఈ నియామక పరీక్షలకు మొత్తం 36,670 మంది దరఖాస్తు చేసుకోగా 31, 075 మంది హాజరయ్యారని, హాజరు శాతం 84.74 గా నమోదయిందని వివరించారు. మొత్తం మీద 5,595 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఏఈఈ నియామక పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో దళారుల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు.















