వరంగల్ జిల్లా : తమ న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఉద్యోగులకు మద్దతుగా నిలిచింది భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్). ఈ సందర్బంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో పాటు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు . అక్రమంగా నిర్బంధంలోకి తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి నియంత లాగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.
గురువారం పోలీసుల ముందస్తు అనుమతితో హనుమకొండలో జరిగిన ఉద్యోగుల నిరసనలో పాల్గొన్నారు.
ప్రతిపక్షం గొంతు నొక్కేలా పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఏడవ హామీ గురించి గొప్పగా చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అణచి వేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రేవంత్ రెడ్డిని, ఆయన పార్టీని బండకేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. పార్టీపై, పాలనపై పట్టు కోల్పోయిన సర్కార్ ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు.















