హైదరాబాద్ : నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఉన్నట్టుండి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న జై శ్రీరాం అనే వాళ్లలో చాలా మంది దొంగలు ఉన్నారంటూ బాంబు పేల్చారు. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ వాద సంస్థలు. హైదరాబాద్ లో తనపై కేసు కూడా నమోదైంది. ఇది ఇలా ఉండగానే మరో సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అనసూయ భరద్వాజ్ తాజాగా మహిళలకు సంబంధించి వైధవ్య ఆచారాలపై స్పందించారు. భర్త మరణం తర్వాత మహిళలు పాటించే సంప్రదాయ ఆచారాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం పై చర్చ కొనసాగుతోంది. ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక వీడియోలో భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, పట్టీలు ధరించడం ఎందుకు మానేయాలని ఆమె ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ అంతకు ముందు తన తల్లి ఎప్పుడూ బొట్టు, రంగురంగుల గాజులు, పట్టీలతో అందంగా తయారయ్యే వారని, కానీ భర్త మరణం తర్వాత వాటిని ధరించడం మానేశారని ఆమె పేర్కొన్నారు.
అటువంటి అలంకరణలు కేవలం వివాహానికి మాత్రమే పరిమితం అని ఎందుకు భావించాలని ఆమె ప్రశ్నించారు. పెళ్లికి చాలా కాలం ముందు నుండే, చిన్న వయసులోనే తల్లులు, అమ్మమ్మలు/నానమ్మల ద్వారా అమ్మాయిలకు బొట్టు, కాటుక, గాజులు, పట్టీలు, మెహందీ, నెయిల్ పాలిష్ వంటి వాటితో పరిచయం ఏర్పడుతుందని అనసూయ భరద్వాజ్ గుర్తు చేశారు. పెళ్లికి ముందు ఇవన్నీ ఒక మహిళ జీవితంలో భాగంగా ఉన్నప్పుడు, భర్త మరణం తర్వాత అవి ఎందుకు అంగీకారం కానివిగా మారుతాయి? అంటూ ప్రశ్నించారు. వితంతువు వాటిని తీసి వేయాలని ఎక్కడ రాసి ఉందో చెప్పాలని అడిగారు. ప్రియమైన వారి మరణం తర్వాత సంతాపానికి చిహ్నంగా ఈ ఆచారాలను పాటిస్తుంటే, తల్లి లేదా అమ్మమ్మ/నానమ్మను కోల్పోయినప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలే ఉండాలి కదా అని ఆమె వాదించారు. అదే సమయంల, ఎవరి నమ్మకాలను కించపరచడం తన ఉద్దేశ్యం కాదని అనసూయ స్పష్టం చేశారు.


















