హైదరాబాద్ : ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజేతలకు అందించే బహుమతి నగదు, కానుకల విషయంలో నోరు జారారు. ఓ ఛానల్ తో జరిగిన సంభాషణలో పల్లవి ప్రశాంత్ దారునమైన కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసేలా చేసింది. గెలుపొందిన సమయంలో తనకు ఇచ్చిన బహుమతి నగదు, కానుకల విషయంలో భారీ కోతలు విదించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపు మొత్తంలో జరిగిన భారీ కోతల గురించి ఆయన వివరించారు. వాస్తవానికి బహుమతి నగదు రూ. 50 లక్షలుగా ప్రకటించినప్పటికీ ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ షో నుండి వైదొలగడానికి రూ. 15 లక్షలు ఉన్న సూట్‌కేస్‌ను తీసుకోవడంతో, విజేతకు దక్కే మొత్తం నగదు రూ. 35 లక్షలకు తగ్గింది. ఆ నగదును పొందడానికి చాలా సమయం పట్టిందని, చివరకు అది చేతికి వచ్చేసరికి పన్నులు మరియు జీఎస్టీ రూపంలో దాదాపు 40 శాతం కోత పడిందని ప్రశాంత్ వాపోయారు.
అసలు కానుకల విషయంలో ఊహించని ఖర్చులు, షోలో బహుమతులుగా ఇచ్చిన అదనపు రివార్డులకు సంబంధించి దాగి ఉన్న ఖర్చులు కూడా ఉన్నాయని ప్రశాంత్ వెల్లడించారు. తనకు బహుమతిగా ఇచ్చిన కారు విషయంలో రూ. 8.5 లక్షల కోత విధించారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు కారును తీసుకునే అవకాశం లేదని తనకు చెప్పారని ఆయన ఆరోపించారు. అలాగే టీమ్ బహుమతిగా వాగ్దానం చేసిన ఒక నెక్లెస్ విషయంలో రూ. 5 లక్షల కానుకలపై పన్ను చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానుకలు అని చెప్పిన వస్తువుల కోసం తాను ఎందుకు డబ్బు చెల్లించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. పన్నులు, కారు , నెక్లెస్ కోసం జరిగిన మొత్తం కోతలు పోను, చివరకు నగదు బహుమతిలో తనకు మిగిలింది కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమేనని పల్లవి ప్రశాంత్ చెప్పారు.



















