దక్షిణాఫ్రికా : స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ లేదా విరాట్ కోహ్లీలలో టెస్టుల మ్యాచ్ ల పరంగా ఎవరు గొప్ప క్రికెటర్ అన్న దానిపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా విదేశీ టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ మెరుగ్గా రాణించారని పేర్కొన్నారు. విదేశీ పరిస్థితుల్లో ప్రమాణాలను నెలకొల్పిన మొదటి భారతీయ బ్యాటర్ సచిన్ టెండూల్కరే అయినప్పటికీ కోహ్లీ ఆ ప్రమాణాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తెలిపారు. గాలేలో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తరపున ఆ ఒరవడిని మొదలు పెట్టిన సచిన్ టెండూల్కర్ వంటి వారి గురించి నేను ఆలోచిస్తాను. బహుశా విరాట్ కోహ్లీ అంత శారీరక బలం ఆయనకు లేకపోవచ్చు, కానీ సచిన్ తర్వాత వచ్చిన కోహ్లీ ఇంకా మెరుగ్గా రాణించారని అన్నారు.
అయితే, ఉప ఖండానికి చెందిన బ్యాటర్ అయినప్పటికీ బౌన్సీ , సీమింగ్ పిచ్‌లపై కూడా బాగా ఆడగలమని నిరూపించిన మొదటి వ్యక్తి సచినే అని నా అభిప్రాయం అన్నారు. విరాట్ ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రమాణాలను మరింత పెంచారు అని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ 200 మ్యాచ్‌లలో 15,921 పరుగులు అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 123 టెస్టుల్లో 9,230 పరుగులతో ఆల్-టైమ్ జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. కోహ్లీ 2025లో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అయితే, గణాంకాలను పరిశీలిస్తే విదేశీ టెస్టుల్లో కోహ్లీ కంటే టెండూల్కర్‌కే ఆధిక్యత కనిపిస్తోంది. టెండూల్కర్ 106 విదేశీ టెస్టుల్లో 54.74 సగటుతో 8,705 పరుగులు చేశారు. మరోవైపు, కోహ్లీ 66 విదేశీ టెస్టుల్లో 41.51 సగటుతో 4,774 పరుగులు సాధించారు.


















