విజయవాడ : ఎల్ నినో ప్రభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, ఈ తరుణంలో నీటిని పొదపుగా వాడుకోవాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడ-క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర డ్యాం నీటి లభ్యత, త్రాగు నీటి అవసరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేపట్టారు. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్త హాజరయ్యారు. ఎల్నినో వంటి క్లిష్టపరిస్దితుల్లో ఎల్ఎల్సి, హెచ్ఎల్సి నీటి కేటాయింపులు, వినియోగంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. 2027 జూలై వరకు రాయలసీమ ప్రాంతానికి తాగు నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
తుంగభద్ర డ్యాంలో కర్ణాటక వాటా 65.56 శాతం, ఎపి వాటా 31.36 శాతం కాగా, తెలంగాణా వాటా 3.07 శాతంగా ఉందని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ ఏడాది మొత్తంగా, తుంగభద్ర డ్యాంకు 105 టిఎంసిలు మాత్రమే వస్తాయని అంచనా. ఏపీ వాటాగా 32.9 టిఎంసిలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తుంగభద్రలో అందుబాటులో ఉన్న ఏపీ వాటా 32.9 టిఎంసి లలో, హెచ్ ఎల్ సి కు 11.88 టీఎంసీ లు, ఎల్ ఎల్ సి కు 16.09 టీఎంసీ లు, కే సి కెనాల్ కు 4.95 టీఎంసీలు వస్తాయన్నారు మంత్రి. రాష్ట్ర వాటాగా ఉన్న స్వల్ప నీటి నిల్వలను, కేవలం తాగునీటి చెరువులు నింపడానికి మాత్రమే వినియోగించాలని కోరారు.
ఎల్నినో వంటి కరువు పరిస్దితుల్లో ప్రజల్లో అవగాహన కల్పించకుండా గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు నిమ్మల రామానాయుడు. విపత్కర పరిస్దితుల్లో కూడా రాయలసీమకు త్రాగు నీరందిస్తున్నామంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమవుతోందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను అప్రమత్తం చేయాలే గానీ, తప్పుదోవ పట్టించకూడదు అని హితవు పలికారు. వైసిపి ప్రభుత్వం మాదిరి వాటర్ మేనేజ్మెంట్ చేస్తే, ఏ రిజర్వాయర్ లోనూ నీళ్ళుండవు అన్నారు.















