హైదరాబాద్ : 22ఎ – పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇది పేదల ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ‘ఇందిరమ్మ ప్రభుత్వం’, ఏ పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం చేయదన్నారు. పేదవారికి హక్కుగా దక్కిన భూమిలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోదన్నారు. వారి హక్కులు , ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 22A నిషేధిత జాబితా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపారు. దీనిలో భాగంగా 24 గంటల వ్యవధిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 చొప్పున మొత్తం 34 రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు.
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 22A పరిధిలోకి వచ్చే నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు క్షేత్ర స్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతోందని ఆయన తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా తాము ఆ పొరపాటును పారదర్శకంగా అంగీకరించామన్నారు మంత్రి . అదే సమయంలో, జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామన్నారు. ప్రజలను ఇబ్బందుల్లో వదిలేయడం మా ప్రభుత్వ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో వివిధ జీవోలు , మెమోల ద్వారా క్రమబద్ధీకరించబడిన ప్రైవేట్ భూములు, అలాగే హైకోర్టు , జీహెచ్ ఎంసీ , హెచ్ ఎం డీఏ నుండి అనుమతులు పొందిన స్థలాలు… ఆన్‌లైన్ అప్‌లోడ్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా 22A జాబితాలో చేరి పోయాయని మంత్రి వివరించారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను గుర్తించి, ప్రభావిత వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునరుద్ధరించిందని ఆయన పేర్కొన్నారు.
22A సమస్యల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ , ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రాబోయే 15 రోజుల్లో ఈ కమిటీ దరఖాస్తులను ప్రతిరోజూ పరిశీలిస్తుందని, నిజమైన ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. పేదవారి సమస్యను ఇకనైనా రాజకీయీకరించడం మానేయండి. ఇది పేదల ప్రభుత్వం… పేదల ఆశీర్వాదంతో ఏర్పడిన ‘ఇందిరమ్మ’ ప్రభుత్వం. పేదవారికి హక్కున్న భూమి విషయంలో అంగుళం మేర కూడా అన్యాయం జరగనివ్వం.

















