అమరావతి : సీఎం చంద్రబాబు రాకతో బీసీలకు మరోసారి మంచిరోజులు వచ్చాయని మంత్రి సవిత అన్నారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూ, బీసీలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత బీసీలకు మొదటి బడ్జెట్ లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్ లో రూ.47 వేలు కోట్లు, మూడో బడ్జెట్ లో రూ.51 వేల కోట్లు కేటాయించామన్నారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వ తదుపరి చర్యకు పంపించామని గుర్తు చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. గీత కార్మికులకు మద్యం షాపులు, బార్లు కేటాయింపుల్లోనూ 10 శాతం మేర కేటాయించామన్నారు. మద్యం షాపుల లైసెన్స్ లో 50 శాతం రాయితీ ఇచ్చామన్నారు. వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు, 50 శాతం మేర సినరేజీ మినహాయింపు ఇచ్చామన్నారు. చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. 62,541 నేతన్నలకు 200లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
85,940 మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు సవిత. 71,536 మంది చేనేతలకు నేతన్నల సేవలో పథకం వర్తింప జేశామన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు మేలు కలుగజేయాలన్న సంక్పలంతో నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2024-26 మధ్య 15.67 లక్షల బీసీ లబ్ధిదారులకు రూ.15,588.64 కోట్లు చెల్లించామన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున 10.46 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.1,360.61 కోట్లు అందజేశామన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా 40,610 మంది ఆటో డ్రైవర్లకు రూ.60.91 కోట్లు కేటాయించామన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు కూటమి ప్రభుత్వం అదనంగా రూ. 20 వేలు రాయితీ అందజేస్తోందన్నారు. తల్లికి వందనం, ఫ్రీ బస్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత ఇసుక, పెన్షన్లు ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలేనని మంత్రి సవిత తెలిపారు.

















