బెంగళూరు : గ్యారెంటీ పథకాలకు సంబంధించి సర్కార్ చేస్తున్న ఖర్చులపై ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీజేపీ ప్రతిపక్ష నేత ఆర్. అశోక. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు. సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రసంగంలో ప్రభుత్వ ‘గ్యారెంటీ పథకాల’కు సంబంధించి వెల్లడించిన గణాంకాలు, వారి సొంత ప్రభుత్వ అధికారిక రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఖర్చయిన ప్రతి రూపాయి , లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి వివరాలు ఉండాలని ఆయన కోరారు. స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రజలకు నిజం చెప్పే రోజే తప్ప, అనుకూలమైన అంకెలను సృష్టించే రోజు కాదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శల విషయం కాదని, ప్రజా జవాబుదారీతనం , పన్ను చెల్లింపుదారుల డబ్బుకు సంబంధించిన ప్రాథమిక అంశమని అశోక పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందించే ‘గృహ లక్ష్మి’ పథకాన్ని తీసుకుంటే కర్ణాటక ప్రభుత్వం , గ్యారెంటీ అమలు కమిటీల అధికారిక సమాచారం ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 1.24 కోట్లు గా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మే 25న ఇదే సంఖ్యను పేర్కొంది. అయినప్పటికీ సీఎం డి.కె. శివకుమార్ లబ్ధిదారుల సంఖ్య 1.28 కోట్లుగా పేర్కొన్నారు అని ఆయన అన్నారు. అదనంగా ఉన్న ఆ 4 లక్షల మంది లబ్ధిదారులు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చారు? వారు ఎవరు? ఈ అదనపు చెల్లింపులకు ఎవరు అనుమతి ఇచ్చారు? ముఖ్యంగా, ఆ డబ్బు ఎవరి ఖాతాల్లోకి చేరింది? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, మంత్రులు, అధికారిక ప్రకటనలు, అమలు కమిటీలు పరస్పర విరుద్ధమైన లెక్కలను చూపిస్తుండగా భారీ గ్యారెంటీ పథకాల ద్వారా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం సరికాదు అని ఆయన పేర్కొన్నారు.


















