చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. రాజకీయ ప్రత్యర్థుల అరెస్టుల ధోరణిపై టీవీకే ప్రభుత్వంపై ఉదయనిధి తీవ్ర విమర్శలు చేశారు. నోరు విప్పితే అరెస్టు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్టు. తీవ్రమైన అభద్రతాభావం కారణంగా ఈ ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ పాలనలా వ్యవహరిస్తోంది అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, శాంతియుత నిరసనకారులు , యువ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అరెస్టుల ధోరణిపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకే న్యాయ విభాగం సమావేశంలో ప్రసంగించారు. ఆయన ప్రభుత్వ చర్యలను ఫాసిస్ట్ విధానాలుగా అభివర్ణించారు. కేవలం మాట్లాడినందుకు లేదా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు వ్యక్తులను నిర్బంధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ”
తదుపరి ఎవరిని అరెస్టు చేయాలనే షెడ్యూల్, టైమ్‌టేబుల్‌తోనే వారు ప్రతిరోజూ ఉదయం నిద్రలేస్తున్నట్లుగా ఉంది అని ఉదయనిధి ఆరోపించారు. ఉదయం 8 గంటలకు పోలీసులు నా ఇంటికి వచ్చినప్పుడు నేను వార్తాపత్రిక చదువుతున్నాను. అసమర్థమైన ఈ ప్రభుత్వంపై గళమెత్తినందుకు నన్ను అరెస్టు చేస్తున్నారని నేను భావించాను, కానీ వారి దగ్గర సరైన సమాధానాలు లేవు. న్యాయం జరిగేలా చూసేందుకు మా న్యాయ బృందం మద్రాస్ హైకోర్టులో అత్యంత వేగంగా స్పందించింది అని ఆయన చెప్పారు. ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి “ద్వంద్వార్థం” వచ్చేలా వ్యాఖ్యానించడం , ఆమె గౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలతో తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆగస్టు 4న అరెస్టు అయ్యారు.
మా భావజాలం కోసం గళమెత్తుతున్న జెన్-జెడ్ యువతను చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది. వారి కుటుంబ సభ్యులలో భయాన్ని కలిగించడానికి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ యువ గొంతుకలను రక్షించడానికి మన న్యాయ విభాగం అభేద్యమైన కోటలా పనిచేయాలి అని పిలుపునిచ్చారు ఉదయనిధి స్టాలిన్.

















