అమరావతి : 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేయాలన్న సంకల్పం తీసుకున్నాం అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలు వ్యక్తులుగా మీరేం సంకల్పం తీసుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చేతిలో జాతీయ జెండా, మనస్సులో అజెండాతో సాధించాల్సిన లక్ష్యాన్ని సంకల్పం చేయండి. అనునిత్యం మీ సంకల్పాన్ని నెరవేర్చుకునే ఆలోచనలు చేస్తే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. మనకు స్వాతంత్య్రం ఎందుకు వచ్చిందన్న అంశాన్ని అంతా మర్చి పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. జెండా వందనంతో పాటు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేలా ఆలోచనలు చేయటం ముఖ్యం. రైతులు, విద్యార్ధులు, కార్మికులు, వ్యాపారులు ఎవరైనా తమ తమ స్థాయిల్లో కృషి చేయలని పిలుపునిచ్చారు.
ప్రతీ ఇల్లు, వాణిజ్య సంస్థ పైనా జాతీయ జెండా ఎగరాలి. మండల, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలి. ఓ ప్రజా ఉద్యమంగా తిరంగా ర్యాలీ జరగాలి. వచ్చే 21 ఏళ్లలో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కల సాకారం కావాలి. ఆ శక్తి సామర్ధ్యాలను ప్రజలే అందించాలి. అమరావతి రాజధాని అభివృద్దికి ప్రజలూ ఆలోచనలు పంచుకోవాలి. అమరావతి ఆర్దిక రాజధానిగా ఎదగాలి. అని సీఎం అన్నారు. అనంతరం మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణలతో కలిసి రాయపూడి వద్ద నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని సీఎం పరిశీలించారు.
















