అమరావతి : ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని కట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొన్నేళ్లుగా కల కన్నారని, ఆదిశగా సాకారం అయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణంలో తనను భాగం పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు సీఎంకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. గురువారం అమరావతికి సీ ఈ రోడ్ ను ప్రారంభించారు. విజయవాడ నుంచి రాజధానికి నిర్మించిన వంతెనకు కూడా శ్రీకారం చుట్టారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమరావతికి ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు నారాయణ. అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసిందన్నారు.
ఇదిలా ఉండగా నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు మంత్రి. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుందని చెప్పారు. అమరావతి రాజధాని పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుందన్నారు.. డీప్ టెక్ క్యాపిటల్ గా దీనిని తయారు చేస్తున్నాం అని ప్రకటించారు నారాయణ. ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతుందని, రాబోయే రోజుల్లో టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతుందని చెప్పారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. 190 కిలోమీటర్ల అవుటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డును కూడా కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు.
2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం అని వెల్లడించారు పొంగూరు నారాయణ. సింధూ నాగరికత తరహాలోనే రాజధాని నగరంలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేయాలన్న సంకల్పం తీసుకున్నాం. మరి మీరు ఏం సంకల్పం చేస్తారంటూ ప్రశ్నించారు జగన్ రెడ్డి, ఆయన పరివారాన్ని.
















