అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సినిమా రంగానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందు కోసం చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కి సంబంధించి సింగిల్ విండో విధానం తీసుకు వచ్చింది. ఈ విధానం ఊపందు కోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో 18 సినిమా షూటింగ్ దరఖాస్తులు వచ్చాయి. షూటింగ్ ప్రదేశాల వద్ద శాంతిభద్రతల సమస్యలపై ఆందోళనలను ప్రస్తావిస్తూ, సినిమా నిర్మాణం సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. చలనచిత్ర నిర్మాతల అనుకూల ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన సింగిల్-విండో క్లియరెన్స్ విధానం ద్వారా ఇప్పటికే 18 మంది నిర్మాతలు షూటింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ , థియేటర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ భరత్ భూషణ్ ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ నుండి లభిస్తున్న స్పందన ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు.
18 మందికి పైగా నిర్మాతలు ఇప్పటికే షూటింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేశారని వెల్లడించారుఉ. మా సింగిల్-విండో విధానం వల్ల నిర్మాతలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు పొందారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా షూటింగ్ జరుపుకునే వీలు కలుగుతుందని తెలిపారు. పార్కులు, రోడ్లు, ప్రభుత్వ భవనాలు , ఇతర బహిరంగ ప్రదేశాల కోసం వేర్వేరు ప్రభుత్వ శాఖలతో విడివిడిగా వ్యవహరించాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదిక ద్వారా లొకేషన్‌కు సంబంధించిన అన్ని చెల్లింపులు చేసే వెసులుబాటు ఈ కొత్త విధానంలో ఉందని ఆయన వివరించారు. గతంలో నిర్మాతలు అనేక చోట్ల చెల్లింపులు చేయాల్సి వచ్చేది , వేర్వేరు శాఖలను విడివిడిగా సంప్రదించాల్సి ఉండేది. ఇప్పుడు అన్నీ ఒకే విండో ద్వారా పూర్తవుతాయి. దీనివల్ల నిర్మాతలు , దర్శకులకు మొత్తం ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని స్పష్టం చేశారు భరత్ భూషణ్.
షూటింగ్ ప్రదేశాల వద్ద శాంతిభద్రతల సమస్యలపై స్పందిస్తూ, సినిమా నిర్మాణం సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని భరత్ భూషణ్ చెప్పారు. ఇకపై అటువంటి సమస్యలు తలెత్తవు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లను పూర్తిగా ఇబ్బంది రహితంగా మార్చాలని చీఫ్ సెక్రటరీ కె. సాయి ప్రసాద్ దృఢ సంకల్పంతో ఉన్నారు, వారి సంపూర్ణ మద్దతుకు థ్యాంక్స్ అని తెలిపారు.



















