గోవా : హైదరాబాద్ నగరంలో హైడ్రా పునరుద్ధరిస్తున్న చెరువల్లోకి మంచి నీరు చేరేలా హైడ్రా కసరత్తు చేస్తోంది. మురుగు నీరు చెరువులోకి చేరకుండా వర్షాలు పడినప్పుడు వరద నీరు చేరేలా ఇన్లెట్లను అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టింది. తక్కువ ఖర్చుతో శుద్ధి చేసిన జలాలు చెరువుల్లోకి చేరేందుకు అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో బిట్స్ పిలానీ కేకే బిర్లా గోవా క్యాంపస్ తక్కువ ఖర్చుతో రూపొందించిన వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ సాంకేతికత పరిజ్ఞానాన్ని హైడ్రా పరిశీలించింది. స్థిరమైన మురుగు నీటి నిర్వహణ, పట్టణ సరస్సుల పునరుద్ధరణలో బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ అహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గోవాకు వెళ్లారు. ఇదే అంశంతో పాటు.. ఎస్బీఆర్ టెక్నాలజీ, ఎంబీఆర్ టెక్నాలజీ, వెట్‌ల్యాండ్ ట్రీట్మెంట్ కు సంబంధించిన పలు అంశాలపై క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను తిలకించారు.
నగరంలో చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత యూనస్ కూడా హైడ్రా కమిషనర్ వెంట ఉన్నారు. క్యాంపస్‌లో టెక్నాలజీ ప్రదర్శన వరకే పరిమితం అవ్వకుండా క్షేత్రస్థాయిలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మురుగు నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారు అనే అంశాన్ని పరిశీలించారు. తక్కువ విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, దీర్ఘకాలిక సమర్థతను అధ్యయనం చేశారు. ప్రకృతి ఆధారిత నీటి శుద్ధి తీరును గమనించారు. ఈ సాంకేతికత నీటి నాణ్యతను మెరుగు పరచడంతో పాటు పర్యావరణ పునరుద్ధరణ , జీవ వైవిధ్య పరిరక్షణకు సమర్థవంతంగా దోహద పడుతున్నట్లు అక్కడి ప్రొఫెసర్లు హైడ్రా కమిషనర్‌కు వివరించారు. ముందుగా పాతబస్తీలోని బమృకున్ – ఉద్ – దౌలా చెరువులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించాలని నిర్ణయించినట్టు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ఈ సందర్బంగా తెలిపారు.
















