న్యూఢిల్లీ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రత విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆ పార్టీకి చెందిన ఎంపీలు. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు ఫిర్యాదు చేశారు. తక్షణమే జగన్ రెడ్డికి ఇప్పటికే కొనసాగుతూ వస్తున సెక్యూరిటీని యధావిధిగా ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పట్ల ఏపీ కూటమి ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు. ఇటీవల దేవరపల్లి పర్యటించిన సందర్బంగా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు ఎంపీలు.
గత రెండేళ్లుగా జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని వాపోయారు. జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు ఎంపీలు. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు అమిత్ చంద్ర షా. జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. షాను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డితో పాటు ఎంపీలు ఉన్నారు.
జగన్ భద్రతతో పాటు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు .వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని వాపోయారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్ షాకు తెలిపారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు సంభవించాయని వాపోయారు.
















