అమరావతి : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో రోడ్లు, తాగునీరు, వైద్యం, విద్య , ఇతర పౌర మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు 12 గ్రామ పంచాయతీల పరిధిలో 105 ప్రాజెక్టులతో కూడిన రూ. 30.61 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనట్లు వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరతను తీర్చడం, కనీస వసతులను మెరుగు పరచడం ఈ ప్రాజెక్టుల లక్ష్యమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం తెలిపారు. స్థానిక అవసరాలు , ప్రజల డిమాండ్ ఆధారంగా ఈ పనులను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులలో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, బీటీ రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీ వ్యవస్థలు, అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, రిటైనింగ్ గోడలు తాగునీటి సదుపాయాల నిర్మాణం వంటివి ఉన్నాయి
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం అత్యధికంగా బోడిరెడ్డిగారిపల్లికి రూ. 8.41 కోట్ల విలువైన 16 పనులు కేటాయించబడ్డాయి, ఆ తర్వాతి స్థానంలో వందడికి రూ. 5.25 కోట్ల విలువైన 10 పనులు దక్కాయి. చిన్నమండెంకు 20 పనుల కోసం రూ. 2.91 కోట్లు కేటాయించగా, దేవగుడిపల్లి , టి. సాకిబండలకు వరుసగా రూ. 2.20 కోట్లు , రూ. 2.23 కోట్లు మంజూరయ్యాయి. ప్రధాన రహదారి ప్రాజెక్టులలో బోడిరెడ్డిగారిపల్లిలో రూ. 4.25 కోట్ల వ్యయంతో BT రోడ్డు పునరుద్ధరణ, వందడిలో రూ. 3.54 కోట్ల విలువైన రెండు BT రోడ్లు, కొత్తపల్లిలోని R&R కాలనీని కలిపే రూ. 1.95 కోట్ల BT రోడ్డు, అలాగే టి. సాకిబండను అపిలవంకపల్లితో అనుసంధానించే BT రోడ్డు నిర్మాణం ఉన్నాయి. చిన్నమండెంలో పశువైద్యశాల నిర్మాణం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఈ అభివృద్ధి ప్యాకేజీలో ఉన్నాయని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
దేవగుడిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేయడం , కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి కాంపౌండ్ వాల్ నిర్మించడం వంటి పనులు చేపట్టనున్నారు; అలాగే దిగువగొట్టివీడులో గ్రామ క్లినిక్కు కాంపౌండ్ వాల్ నిర్మాణం , పెండింగ్లో ఉన్న అంగన్వాడీ పనుల పూర్తి వంటి పనులు జరుగుతాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం , డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, నేషనల్ హెల్త్ మిషన్ , నాబార్డ్, జిల్లా పరిషత్ , సాంఘిక సంక్షేమ శాఖ నిధుల ద్వారా ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.















